భార్య గొంతు కోసిన భర్త కుటుంబ కలహాల నేపథ్యంలో బ్లేడుతో హత్యాయత్నం
తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు

మణుగూరు బీటీపీఎస్‌లో దారుణం: భార్య గొంతు కోసిన భర్త
కుటుంబ కలహాల నేపథ్యంలో బ్లేడుతో హత్యాయత్నం
తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు
మణుగూరు, ప్రయత్నం న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గంలోని మణుగూరు భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) ఆవరణలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భార్యపైనే భర్త బ్లేడుతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
మణుగూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన రత్నకుమారి (31) బీటీపీఎస్‌లో క్యాజువల్ లేబర్‌గా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా ఆమెకు, భర్త సాధనపల్లి నరసింహారావుకు మధ్య కుటుంబ వివాదాలు కొనసాగుతున్నాయి. మనస్పర్థల కారణంగా భర్తకు దూరంగా ఉంటూ రత్నకుమారి తన తల్లి వద్ద నివసిస్తున్నారు.
ఈ క్రమంలో విధుల నిమిత్తం బీటీపీఎస్‌కు వచ్చిన రత్నకుమారిపై భర్త నరసింహారావు ఒక్కసారిగా బ్లేడుతో దాడికి తెగబడ్డాడు. ఆమె గొంతు కోయడంతో తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగింది. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్న వారు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన తోటి కార్మికులు, స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, బాధితురాలిని మణుగూరులోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ప్రాజెక్ట్ ఆవరణలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బీటీపీఎస్‌కు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ దాడికి కేవలం కుటుంబ కలహాలే కారణమా, లేక మరేదైనా కోణం ఉందా అనే దిశగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



